UPDATES  

NEWS

 విద్యా వ్యవస్థ చచ్చిపోయింది: ఏఐపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “విద్యార్థులారా మేల్కొండి.. ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది” అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత విద్యా విధానం పూర్తిగా కాలం చెల్లినదని, దానిపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వర్మ అభిప్రాయపడ్డారు.

కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడిన చదువులకు ఇక విలువ ఉండదని ఆర్జీవీ స్పష్టం చేశారు. “ఒకే ఒక్క క్లిక్‌తో లక్షల కేసులను విశ్లేషించి ఏఐ చికిత్స సూచించగలిగినప్పుడు, విద్యార్థులు పదేళ్ల పాటు విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు సమయం వృధా చేయాలి?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. భవిష్యత్ తరాల విద్య పుస్తకాల్లోని సమాచారాన్ని బట్టీ పట్టడం కాదని, ఏఐ పరికరాలను సృజనాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడంలోనే నిజమైన విద్య ఉందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.

వర్మ ఈ సందర్భంగా తీవ్ర హెచ్చరికలు కూడా చేశారు. విశ్వవిద్యాలయాలు, విద్యా బోర్డులు మారే వరకు ఏఐ వేచి చూడదని, మార్పును అందిపుచ్చుకోలేని వ్యవస్థలను అది చెరిపేస్తుందని ఆయన అన్నారు. “ఏఐ మిమ్మల్ని చంపదు, కేవలం పట్టించుకోదు” అని వ్యాఖ్యానించిన ఆర్జీవీ, “ఏఐని వాడలేని వారు భవిష్యత్తులో ఏఐ చేతనే వాడబడతారు” అంటూ హెచ్చరించారు. ఈ ట్వీట్ విద్యా వ్యవస్థలో సాంకేతిక మార్పులు ఎలా ఉండాలనే దానిపై విస్తృత చర్చకు తెరలేపింది.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |