తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజల సమస్యలు తీరలేదని, రాష్ట్రంలోని కష్టాలు ఎక్కడివక్కడే ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ మార్పు లేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు. నల్గొండలో పర్యటించిన కవిత, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి కనీస వసతుల లేమిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో కనీస సౌకర్యాలు లేకపోవడం, ఐసీయూలో ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స అందించడం వంటి లోపాలను ఆమె ఎత్తి చూపారు. గర్భిణులకు ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్ మందు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. దీంతో పాటు, నల్గొండ జిల్లాకు గత 12 ఏళ్లుగా కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో అందకపోవడం, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే కాంట్రాక్టర్‌ను ప్రశ్నించలేని దుస్థితి వంటి అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా కవిత రైతుల సమస్యలపై కూడా పోరాడుతామని స్పష్టం చేశారు. రైతులు పండించిన పత్తిలో 20 శాతం తేమ ఉన్నప్పటికీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే, నల్గొండ పర్యటన సందర్భంగా తన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “జాగృతి నాయకులతో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదు” అని ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.









