ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆపాదిస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన ‘సర్దార్-ఏక్తా పాదయాత్ర’లో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ ఈ నిరాధారమైన ఆరోపణలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశద్రోహం కిందికే వస్తాయని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
“చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని నీచంగా మాట్లాడుతున్నారు. అసలు బాంబు పేలుళ్లకు, బీజేపీకి ఏం సంబంధం?” అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, ప్రజలు ఎవరూ ఇలాంటి అసత్య ప్రచారాన్ని సమర్థించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో బాంబులు పేల్చాలని ఒక వర్గం వారు కుట్ర పన్నారని, ఇప్పుడు ఆ నెపాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఉగ్రవాద చర్యలను ఖండించాల్సింది పోయి, ఒక రాజకీయ పార్టీపై బురద చల్లడం దారుణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు.









