UPDATES  

NEWS

 కంచె గచ్చిబౌలిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

కంచ గచ్చిబౌలి భూముల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గావాయ్ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే విచారణను జులై 23కు వాయిదా వేసింది. ఈ సమయంలో మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

 

కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలుంటాయంది. అధికారులను సమర్ధించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించింది.

 

డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారని.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. కానీ అక్కడ పర్యావరణాన్ని పునరుద్దరించాల్సిందేనంది. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ తదుపరి విచారణను జులై 23కు వాయిదా వేసింది.

 

కాగా.. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్‌ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని.. దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్‌ క్యూరీ కూడా చెప్పారు.

 

అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్‌ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 10వేల కోట్లకు మార్టిగేజ్‌ చేశారని కేంద్ర సాధికార సంస్థ తన నివేదికలో చెప్పిందని అమికస్‌ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్‌ చేశారా.. అమ్మేశారా అన్న అన్నది తమకు అనవసరమని చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా లేదా అన్నదే ముఖ్యమంటోంది సుప్రీం. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రణాళికతో రావాలని కోర్టు ఆదేశించింది.

 

తీర్పు వెలువరించిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో బుల్డోజర్లు ఎందుకున్నాయని సుప్రీం ప్రశ్నించగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు, సెలబ్రిటీలు ఫేక్ AI వీడియోలతో ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేశామని కోర్టుకు తెలిపారు. సో సుప్రీం కోర్టు తాజా కామెంట్ల ప్రకారం కంచ గచ్చిబౌలి భూముల వినియోగంపై సమస్య లేదని, చెట్లు కొట్టడంపై పర్మిషన్ల చుట్టూనే తిరుగుతోంది. మరోవైపు పర్యావరణాన్ని పునరుద్ధరించాలన్న సుప్రీం ఆదేశం.. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన వారందరి విజయంగా కేటీఆర్ చెబుతున్నారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |