తిరుమల లడ్డూ పై వచ్చిన ఆరోపణల పట్ల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. ఈ వివాదాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుందని, అవసరమైతే విచారణలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
తిరుమల లడ్డులో కలిపిన నెయ్యి పట్ల వచ్చిన ఆరోపణలు రోజుకొక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే టిడిపి కూటమి ప్రభుత్వం నెయ్యిలో జరిగిన కల్తీ వ్యవహారం అంతు తేల్చేందుకు సిట్ ద్వారా.. సిద్దం కాగా కేంద్రం సైతం ఈ విషయంపై దృష్టి సారించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం సూచించింది. అలాగే సిట్ విచారణ వేగవంతంగా పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో లడ్డు వివాదంపై బీజేపీ నేత, నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అలాగే వైసీపీపై సైతం మంత్రి ఘాటుగా విమర్శలు గుప్పించారు.
మంత్రి మాట్లాడుతూ.. తిరుమల ప్రతిష్ట దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన నాటి వైసీపీ ప్రభుత్వం, తిరుమల పవిత్రతను కాపాడడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వైసీపీ హయాంలో తిరుపతి ప్రతిష్ట దిగజారిందని తెలిపారు. తిరుమల లడ్డు అంటేనే పవిత్రతకు మారుపేరని, అటువంటి లడ్డుపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందన్నారు. కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి రిపోర్టులు వచ్చాయని, లడ్డు వివాదంను కేంద్రం సీరియస్ గా పరిగణించిందన్నారు. ఇదే వివాదానికి సంబంధించి మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించి.. మళ్ళీ వెనుకడుగు ఎందుకు వేశారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా.. తిరుమల వెళ్లడం ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ప్రస్తుతం లడ్డు వివాదంపై పూర్తి స్థాయి విచారణ సాగుతోందని, విచారణ త్వరితగతిన పూర్తవుతుందన్నారు.
సాక్షాత్తు కేంద్ర మంత్రి, బిజెపి నేత తన మాటల్లో.. నెయ్యిలో కల్తీ వాస్తవమే అంటూ ప్రకటన ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీకి మంత్రి వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పడవేశాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. నిన్న బీజేపీ లక్ష్యంగా వైయస్ జగన్ చేసిన విమర్శలకు మంత్రి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చినట్లు బీజేపీ శ్రేణులు తెలుపుతున్నారు. ఏదిఏమైనా లడ్డు వివాదం రోజుకొక మలుపు తిరుగుతుండగా.. కూటమిలోని పార్టీలు.. వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో జోరు పెంచాయని చెప్పవచ్చు.
ఇక,
విశాఖ ఉక్కు పరిశ్రమపై మంత్రి స్పందిస్తూ.. ఉక్కు పరిశ్రమలో కార్మికులు అధిక సంఖ్యలో ఉండగా.. ఉత్పత్తి తక్కువగా ఉందన్నారు. అయితే ఈ విషయంలో కార్మికులను భాద్యులను చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. నష్టాలు భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని, కార్మికులు కూడా అన్ని విషయాలను అర్థం చేసుకోవాలని కోరారు. అయితే ఉద్యోగులకు నష్టం కలగకుండా.. తాము ప్రధానితో చర్చిస్తున్నట్లు.. అందుకు తగ్గ ఆలోచనలో కేంద్రం ఉందని తెలిపారు.