తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హైడ్రాకు మరింతగా అధికారాలు ఇవ్వటం.. కూల్చివేతల పైన హైడ్రా దూకుడుగా వెళ్లటం రాజకీయంగా వివాదంగా మారుతోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు. ఇప్పుడు వారికి మద్దతుగా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.
బీఆర్ఎస్ నేతల పర్యటన
మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటన చేపట్టింది. బీఆర్ఎస్నేతల బృందానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. స్థానికులకు హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం భరోసా కల్పించింది. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి, రూ.లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టడం ఏంటని హరీశ్‌రావు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రేవంత్ పై విమర్శలు
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, పథకాలకు డబ్బులు లేవంటూనే మూసీ డీపీఆర్కే రూ.1500 కోట్లు ఖర్చు చేస్తారా అని మండిపడ్డారు. మూసీకి అంత ఖర్చు చేసేవారు రూ.150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అంటూ నిదీసారు. 7 నెలల నుంచి మధ్యాహ్నా భోజన బిల్లు రావట్లేదని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోయింది అంటూనే గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని హరీశ్రావు ధ్వజమెత్తారు.
ప్రభుత్వం యాక్షన్ ప్లాన్
గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాక మరెక్కడి నుంచి తెస్తారో చెప్పాలని హరీశ్రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని, మూసీ పరీవాహక ప్రజలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హరీశ్‌రావు హెచ్చరించారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రతీ బస్తీకి తమ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే అండగా నిలుస్తారని వెల్లడించారు. అటు బీజేపీ సైతం ఈ అంశం పైన కార్యాచరణకు సిద్దమవుతోంది. దీంతో…ఇప్పుడు రేవంత్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.