అసెంబ్లీ ఎన్నికల వేళ- కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతికి నిరసనగా కాశ్మీరీయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. భారీ ర్యాలీలను నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. చివరి విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉంది. ఈ నెల 18, 25 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. చివరి విడత ఎన్నికల ప్రక్రియ మిగిలివుంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో 1వ తేదీన ఉదయం 7 గంటలకు తుది పోలింగ్ ఆరంభం కావాల్సి ఉంది.
ఈ దశలో 12,00,977 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 6,19,000 మంది పురుషులు, 5,81,887 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారి కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో 1,494 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
ఈ పరిణామాల మధ్య జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం, హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చడం పట్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలకు దిగారు.
బుద్గాంలో భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. వందలాది మంది స్థానికులు ఇందులో పాల్గొన్నారు. పాలస్తీనా జాతీయ జెండాను ప్రదర్శించారు. హసన్ నస్రల్లాకు నివాళి అర్పించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ దాడులను పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
ఈ పరిణామాలతో జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో అదనపు బలగాలను తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్రిక్తతల ప్రభావం ఓటింగ్‌పై ఉండబోదని అంచనా వేస్తోన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తారని చెబుతున్నారు.
లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతం అయ్యారు. ఆయనతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, ఇతర కమాండర్లు కూడా మృతిచెందారు. బీరుట్ దక్షిణ ప్రాంతంలోని దహియాలో గల హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో వారిద్దరూ మరణించారు. ఈ విషయాన్ని హెజ్బొల్లా అధికారికంగా ధృవీకరించింది