త్వరలో తెలంగాణలో లోక్ బాడీ ఎన్నికల నగారా మోగనుంది. అన్ని ఒకే అయితే జూన్ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు బీసీ కమిషన్ లెక్కల ప్రకారం ఉండాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఇందుకు అనుగుణాంగానే బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా గత 3 స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు, రిజర్వేషన్లు, జనామా, ఓటర్ లిస్ట్ వివరాలు అందించాలని పంచాయతీ రాజ్ శాఖను బీసీ కమిషన్ కోరింది. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. అయితే లోక్ సభ ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ లోనే లోక్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బీసీ లెక్కలు తేలకపోవడంతో ఎన్నికలకు కాస్త సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో కుల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.150 కోట్లు కేటాయించారు. కుల గణన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేక ఎన్నికల తర్వాత కుల గణన చేస్తారా అనేది స్పష్టత లేదు.
గతంలో తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ఇది ఒక్క రోజులోనే పూర్తి చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కులగణన అలానే చేయాలని డిమాండ్ ఉంది. కుల గణనకు ముందు చేపట్టాల్సి పనులు ఉంటాయని.. దీని కోసం నెల రోజుల సమయం పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. కులగణన కోసం నోడల్ ఏజెన్సీల ఎంపిక, ఆల్ పార్టీ మీటింగ్, ప్రజా సంఘాలతో మీటింగ్, మేధావులు అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వారు చెబుతున్నారు.









