దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా వివిధ రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా ముగిసింది. కాగా, సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్ నమోదైంది. 96 నియోజకవర్గాల్లో 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పంచుకున్న గణాంకాల ప్రకారం.. సాయంత్రం 5 గంటలకు 62.3% ఓటింగ్ నమోదైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75.66%, మధ్యప్రదేశ్‌లో 68.01% పోలింగ్ శాతం నమోదైంది. 1996 తర్వాత జాతీయ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ఓటు వేశారు. బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ శ్రేణుల పలుచోట్ల ఘర్షణ చెలరేగింది. దుర్గాపుర్‌లో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. భద్రతా దళాలు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈవీఎంలు పని చేయకపోవడం, ఏజెంట్ల అడ్డగింత వంటి ఫిర్యాదులు వెయ్యికి పైగా అందినట్లు అధికారులు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 8 చొప్పున, బిహార్లో 5, ఒడిశా, జార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్మూకాశ్మీర్లోని ఒక లోక్‌సభ నియోజకవర్గంలో నాలుగో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది.
నాలుగో విడత పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన అధీర్ రంజన్ చౌధరీ, తృణమూల్ నేత మహువా మొయిత్రా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తృణమూల్ తరపున కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేశారు. కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్న సిన్హా బెంగాల్ లోని అసన్సోల్ నుంచి తృణమూల్ తరపున పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేవ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్ నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు.