ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడంతో ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 68 శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు ఉండటంతో.. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.
ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత 3500కుపైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. రాత్రి 11 గంటల వరకు కూడా పలు చోట్ల పోలింగ్ కొనసాగింది. విశాఖపట్నం జిల్లాలో దాదాపు 135 పోలింగ్ కేంద్రాల్లో అర్దరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో అర్దరాత్రి తర్వాత కూడా పోలింగ్ కొనసాగడం గమనార్హం.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని భూపతిపల్లెలో 96వ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే ఐదుసార్లు ఇలా అంతరాయం కలగడంతో సోమవారం అర్దరాత్రి వరకూ వేచివుండి 200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అర్దరాత్రి వరకు కొనసాగడంతో పోలింగ్ శాతం 75 శాతానికిపైగా నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇక, పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ.. ప్రజలు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఎండా, వానలను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. హైదరాబాద్ నగరం నుంచి కూడా భారీ సంఖ్యలో ఏపీకి తరలివచ్చి తమ ఓటును వేశారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, రేపు ఉదయం వరకు అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించి పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని మంగళవారం వెల్లడిస్తామని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
పోలింగ్ శాతం జిల్లాల వారీగా..
అల్లూరి సీతారామరాజు జిల్లా – 63.19 శాతం అనకాపల్లి – 81.63 శాతం అనంతపురం – 79.25 శాతం అన్నమయ్య – 76.12 శాతం బాపట్ల – 82.33 శాతం చిత్తూరు – 82.65 శాతం కోనసీమ – 83.19 శాతం తూ.గో. జిల్లా – 79.31 శాతం ఏలూరు – 83.04 శాతం గుంటూరు – 75.74 శాతం కాకినాడ – 76.37 శాతం కృష్ణా జిల్లా – 82.20 శాతం కర్నూలు – 75.83 శాతం నంద్యాల – 80.92 శాతం ఎన్టీఆర్ జిల్లా – 78.76 శాతం పల్నాడు – 78.70 శాతం పార్వతీపురం మన్యం – 75.24 శాతం ప్రకాశం జిల్లా – 82.40 శాతం నెల్లూరు – 78.10 శాతం శ్రీ సత్యసాయి జిల్లా – 82.77 శాతం శ్రీకాకుళం – 75.41 శాతం తిరుపతి – 76.83 శాతం విశాఖపట్నం – 65.50 శాతం విజయనగరం – 79.41 శాతం ప.గో. జిల్లా – 81.12 శాతం కడప – 78.71 శాతం పోలింగ్ నమోదైంది.