ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాల తరువాత ఒకే విడతలో ఒకేరోజు 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 25 లోక్ సభ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. గతంలో కంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటు వెయ్యడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించడం, ఎండను కూడా లెక్క చెయ్యకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి చరిత్ర తిరగరాశారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకుల అరాచకాలపై ఇప్పటికే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ, బీజేపీ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనవి చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలో పోలింగ్ రోజు దాడులు జరిగిన విషయం తెలిసిందే.
పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలంలోని తంగెడ గ్రామం పోలింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేవారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లను భయభ్రాంతులకు గురి చెయ్యడానికి ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసి బెదిరించారు. తరువాత పెట్రోల్ బాంబులు వేసి ప్రజలు పారిపోయేలా చేసి టీడీపీ కార్యకర్తల ఆస్తులు తగలబెట్టారు.
పల్నాడులో వైసీపీ కార్యకర్తల దాడులతో 20 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వైసీపీ నాయకులు దాడులు చెయ్యడం కలకలం రేపుతోంది. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో అర్దరాత్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేసి తలల పగలగొట్టడం కలకలం రేపుతోంది.
పోలింగ్ పూర్తి అయిన తరువాత ఆ పోలింగ్ కేంద్రంలో టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయని వైసీపీ నాయకులకు అనుమానం వచ్చింది. అర్దరాత్రి రామిరెడ్డిపల్లి పంచాయితీలో పోలింగ్ తీరుతో మొదలైన గొడవ రాళ్లు విసురుకునే వరకు వచ్చింది. ఈ దాడిలో టీడీపీకి చెందిన 8 మందికి గాయాలైనాయి. ఈ దెబ్బకు గ్రామంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనడంతో గ్రామస్తులు హడలిపోయారు. అదే గ్రామంలో ఉన్న కారు మీద పెట్రోలో పోసి నిప్పంటించారు. మరో రెండు కార్ల అద్దాలు ధ్వంసం చెయ్యడంతో పరిస్థితి అదుపుతప్పింది.
గొడవ జరిగిన సమయానికి అదే గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అతని తమ్ముడు హర్షిత్ రెడ్డి ఆ గ్రామం వదిలి బయటకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, అతని కుమారుడు వినీల్ అక్కడికి వెళ్లడంతో వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. తీవ్రగాయాలైన టీడీపీ కార్యకర్తలను నారావారిపల్లెలోని ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించి అక్కడ వైద్యం చేయించి తరువాత వారిని తిరుపతికి తరలించారు. టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చెయ్యడంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.