UPDATES  

NEWS

 ఏపీలో పథకాలకు బ్రేక్ పై ఈసీకి హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఎన్నికల సమయంలో నగదు బదిలీ పథకాల మొత్తాల్ని ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలు ముగిసేవరకూ నగదు బదిలీ పథకాల మొత్తం లబ్దిదారుల ఖాతాల్లోకి పంపకుండా ఈసీ అడ్డుకోవడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆక్షేపించింది. అయితే విచారణ తర్వాత మాత్రం ఈసీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ వీటి విడుదలను వాయిదా వేసింది.

 

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నగదు బదిలీ పథకాల మొత్తాలను లబ్దిదారుల ఖాతాల్లోకి పంపేందుకు వీలుగా బటన్లు నొక్కేసిన సీఎం జగన్.. ఆ డబ్బు రూ.14 వేల కోట్లను మాత్రం ఎన్నికల వేళ జమ చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీనిపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈసీ అభిప్రాయం కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇస్తే అనుమతి ఇస్తామని తెలిపింది. కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈసీ ఎన్నికలు ముగిశాకే నగదు బదిలీ చేయాలని ఆదేశించింది.

 

దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న రాత్రి విచారణ జరిపి ఇవాళ ఒక్కరోజు నగదు బదిలీకి అవకాశం కల్పించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులు తమకు అందడంలో ఆలస్యాన్ని కారణంగా చూపుతూ ఈసీ నగదు బదిలీకి అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీలు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవాళే నగదు బదిలీ ఎందుకంటూ వివరణ కోరింది. అనంతరం హైకోర్టులో జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

 

ఈసీ అప్పీలుపై హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్బంగా ఈసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీబీటీకింద నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎన్నికల సంఘం ఏ అధికారంతో తిరిగి స్పష్టత అడిగిందని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. రిట్ అప్పీలు వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏవిధంగా పక్కనపెడుతుందని అడిగింది. చట్టంపై ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా అని హైకోర్టు ప్రశ్నించింది.

 

ఇప్పటికే తెలంగాణాలో రైతు భరోసాకు ఏ రకంగా అనుమతిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ రాష్ట్రంలో ఈ పథకాలను ఏవిధంగా అడ్డుకుంటారని అడిగింది. ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ సమదృష్టితో వ్యవహరిస్తోందని తాము అనుకోవడం లేదని తెలిపింది. హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుందని వ్యాఖ్యానించింది. దీన్ని న్యాయసమీక్షాధికారంగా చూడాల్సి వస్తుందని తెలిపింది.

 

మరోవైపు 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుతించినప్పుడు అనుసరించిన కోడ్ నియమాలను ఇప్పుడు పాటించడంలేదని స్పష్టం అవుతూందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్ ను ఇప్పుడు అనుసరించలేదని ఆక్షేపించింది. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీలుకు వచ్చిన నవతరం పార్టీకి కూడా హైకోర్టు ప్రశ్నలు వేసింది.

 

ఈ ఎన్నికల్లో నవతరం పార్టీ ఎన్నిచోట్ల పోటీచేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో ఎన్నిచోట్ల పోటీచేసిందని అడిగింది. హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందికి బెదిరింపులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాదనల సందర్భంగా అప్పీలు వేసిన న్యాయవాదిని దీనిపై ప్రశ్నించింది. దీంతో హైకోర్టుకు పిటిషనర్ తరఫు న్యాయవాది నాదకర్ణి క్షమాపణలు చెప్పారు. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు సమయం లేనందున జూన్ కు కేసును వాయిదా వేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |