ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, ఎన్నికల ప్రచారం చేసే హక్కు ప్రాథమికమైనది కాదని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు ఒక రోజు ముందు ఈరోజు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భాను ప్రియ అఫిడవిట్ దాఖలు చేశారు.
“ఎన్నికల కోసం ప్రచారం చేసే హక్కు ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కాదు. ఈడీ పరిజ్ఞానం మేరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడుకి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేదు.” అని దర్యాప్తు సంస్థ అఫిడవిట్‌లో పేర్కొంది.
గతంలో కూడా కేజ్రీవాల్ ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరుతో ఈడీ సమన్లను తప్పించుకోవడానికి ఆప్ అధినేత ప్రయత్నించారని.. ఇప్పుడు కూడా అదే సాకుతో మధ్యంతర బెయిల్ కోరుతున్నారని ఈడీ అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే, ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేయలేమని, జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ వాదించింది.
గత మూడేళ్లలో దాదాపు 123 ఎన్నికలు జరిగాయని, ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే, ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని ఈడీ తెలిపింది.
ఎన్నికల్లో ప్రచారం కోసం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే అది రూల్ ఆఫ్ లా ను ఉల్లంఘించడమేనని ఈడీ పేర్కొంది. అనైతిక రాజకీయ నాయకులందరూ నేరాలకు పాల్పడటానికి, ఎన్నికల ముసుగులో దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ లేదా మరే ఇతర రాజకీయ నాయకుడు సాధారణ పౌరుడి కంటే ఎక్కువ ప్రత్యేక హోదాను పొందలేరని కూడా పేర్కొంది.