వైనాట్ 175 నినాదంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్. ”సిద్ధం” పేరిట జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారాయన.సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో “మేమంతా సిద్ధం” పేరిట జగన్ బస్సు యాత్ర చేపట్టారు. జగన్ చేపట్టిన “మేమంతా సిద్ధం” యాత్రకు ప్రజల అనూహ్య స్పందన లభించింది. జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో మునిగిపోయాయి. ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
బుధవారం ఎన్నికల ప్రచారానికి గ్యాప్ ఇచ్చిన ఆయన గురువారం మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కూటమి నేతలను టార్గెట్ చేసుకుని సీఎం జగన్ వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై విధానమేంటో చెప్పాలని చంద్రబాబును నేరుగా డిమాండ్ చేశారు. ముస్లింలను మోసం చేస్తారా? లేదా వారికి అండగా ఉంటారా అని జగన్ చంద్రబాబును నిలదీస్తున్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాలని తమ పార్టీ చెప్తుంటే.. కూటమి ఎలాంటి ప్రకటన చేయలేని స్థితిలో నిలిచాయని సీఎం జగన్ ఎద్దెవా చేశారు.
రిజర్వేషన్లు ఉండాలని తాను చెప్పడమే కాదు.. పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించి చూపానని కర్నూలు సభలో ప్రకటించారు. నలుగురు ఎమ్మెల్సీలు, ఏడుగురు మైనార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామన్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మోదీ, అమిత్ షాల నోటి వెంట రాలేదని..మొన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన మోదీ.. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. 58నెలల పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని వివరిస్తూ.. మరోసారి ఫ్యాన్ గెలుపు అవసరాన్ని జగన్ ప్రజలకు వివరించారు .