ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మే నెలలో లబ్దిదారులకు ఇవ్వాల్సిన నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఇవాళ క్లారిటీ ఇచ్చేసింది.
ఇప్పటికే పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వానికి ఈసీ నుంచి క్లారిటీ లభించింది. అలాగే ఈ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు కూడా స్పష్టత వచ్చినట్లయింది.
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే మేనెలలో విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల నిధులకు సీఎం జగన్ బటన్ నొక్కేశారు. అయితే ఈ నిధుల విడుదల మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ నిధుల విడుదలకు సిద్దమైన ప్రభుత్వానికి ఈసీ గతంలోనే షాకిచ్చింది. మేనెలలో విడుదల కావాల్సిన విద్యాదీవెన, రైతు భరోసా నిధుల్ని విడుదల చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈసీ వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల నిధులు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఏంటో చెప్పాలని కోరినట్లు తెలిపింది. దీంతో హైకోర్టు కూడా ఈసీకి ఈ విషయంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలను ఎన్నికలు ముగిసేలోపు విడుదల చేయొద్దంటూ తాజాగా ఈసీ మార్గదర్శకాలు పంపింది. ఎన్నికలు ముగిశాక పథకాల నిధులు విడుదల చేసుకోవచ్చని సూచించింది.