UPDATES  

NEWS

 బైంసాలో ఉద్రిక్తత.. కేటీఆర్‌పైకి టమాటాలు, ఉల్లిగడ్డలు..

రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసాలో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 నెలల కింద కేసీఆర్ ఇక్కడికి వచ్చారని, కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని అప్పుడు ఆయన చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.

 

ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందో చూశారు కదా? కరెంట్ కోతలు ఉన్నాయా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు రేవంత్ చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన హామీల్లో ఒక్క హామీ అన్న అమలైందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంకా కాంగ్రెస్ ను నమ్ముదామా? మళ్లీ వాళ్లకే ఓటు వేద్దామా? అని ప్రజలను అడిగారు.

ఆత్రం సక్కు గారు సీనియర్ నాయకులు. ఆదివాసీల కోసం ఎంతో కృషి చేశారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు 5 నెలల్లో చాలా హామీలిచ్చి మనల్ని మోసం చేశారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. పదేళ్ల క్రితం ఎన్నో డైలాగులు చెప్పి బీజేపీ వాళ్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారన్నారు కేటీఆర్.

 

కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా. మీరు 13 తారీఖు నాడు ఆత్రం సక్కుని కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించండి. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం సరైన వ్యక్తులకు అవకాశం ఇవ్వలేకపోయాం. మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు పోనివ్వడి. చెత్తంతా పోతోంది. బీజేపీ వాళ్లు ఏమైనా అంటే నమో అంటారు. నమో అంటే నరేంద్ రమోడీ కాదు నమ్మించి మోసం చేసే వ్యక్తి అని కేటీఆర్ విమర్శించారు.

 

పదేళ్లలో దేశానికి గాని ఆదిలాబాద్ కు గానీ ప్రధాని ఒక్క పనిచేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్ లో సీసీఐ ను ఓపెన్ చేయలే. బీజేపీ ఎంపీ ముధోల్ తాలుకాలో ఒక్కటంటే ఒక్క పని చేయలే. 2014 మోడీ చాలా హామీలిచ్చిండు. రైతుల ఆదాయం డబుల్, అందరికీ ఇళ్లు, ఇంటింటికి నల్లా అని చాలా చెప్పాడు. కానీ చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

 

బీజేపీవాళ్లు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఏమన్న అంటే జై శ్రీరాం అంటారు. శ్రీరాముడు అందరి వాడు. దేవుళ్లు బీజేపీకి చెందిన వాళ్లు కాదు. రాముడు మర్యాద పురుషుడు. రాజధర్మం పాటించాలని చెప్పాడు. మోడీ మాత్రం గుజరాత్ కు వేల కోట్లు ఇస్తాడు. తెలంగాణ కు బుడ్డ పైసా కూడా ఇవ్వడు అని కేటీఆర్ ఆరోపించారు.

 

నిర్మల్జిల్లా భైంసాలో కేటీఆర్ ప్రచారం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్న కేటీఆర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, టమాటలు విసిరారు. ఇలాంటి చిల్లర పనులు చేయొద్దంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బహిరంగంగానే దాడి జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేటీఆర్మండిపడ్డారు. పోలీసులు ఉన్నారా.. దమ్ము ధైర్యం లేదా? అంటూ ప్రశ్నించారు. కాగా, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు కొందరు రామభక్తులు. ఇటీవల ‘జైశ్రీరాం’ అంటే అన్నం దొరుకుతుందా? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన చేసినట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |