భారతదేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార పర్వం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా సాగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమరంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలకు సంబంధించిన నేతలు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.
శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రగడ భారతదేశంలోని భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతుంది. పశ్చిమ ప్రాంత ప్రజలు అరబ్ జాతీయుల మాదిరిగా ఉంటారని , ఈశాన్యం వారు చైనీయుల్లా ఉంటారని, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ ల మాదిరిగా ఉంటారని ఆయన వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఐక్యత గురించి వివరించే క్రమంలో ఆయన ఉపయోగించిన భాష పైన ప్రస్తుతం దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతుంది.
శరీరం రంగుతో ప్రజలను అవమానిస్తారా : మోడీ ఫైర్ దీంతో శామ్ పిట్రోడా వ్యాఖ్యల పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానన్నారు. శరీరం రంగును బట్టి యోగ్యత నిర్ణయిస్తారా? శరీరం రంగుతో ప్రజలను అవమానిస్తారా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు
జాతి వివక్షను ఖండించిన ప్రధాని.. స్పందించిన కాంగ్రెస్ జాతి వివక్ష వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఇటువంటి జాతి వివక్ష వ్యాఖ్యలు చెల్లవని వాటిని అంగీకరించబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఇక తాజాగా శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ సైతం స్పందించింది. భారతదేశంలోని భిన్నత్వం గురించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టమని కాంగ్రెస్ పేర్కొంది.
మాకేం సంబంధం లేదన్న కాంగ్రెస్ అవి ఏమాత్రం ఆమోదించదగినవి కావని కాంగ్రెస్ స్పష్టం చేసింది. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.