రెండు రోజులుగా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలో సోమ, మంగళ, బుధవారం పలు జిల్లాల్లో వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పలు చోట్లు భారీ వర్షం పడింది. దీంతో రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. అలాగే ఐకేపీ కేంద్రంలో అమ్మకానిక ఉంచిన వడ్లు కూడా వర్షానికి తడిపోయాయి. చాలా వరకు ఐకేపీ కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేవు. దీంతో రైతులే టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి ధాన్యాన్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.
భారీ వర్షం కారణంగా పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అమ్మకం పూర్తవుతుందని అన్నదాతలు ఆశించగా అకాల వర్షం వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. కొన్ని చోట్లు జోకిన వడ్లను ఐకేపీ కేంద్రంలోనే ఉంచారు. లారీ దొరక్కపోవడంతో కొనుగోలు కేంద్రంల్లోనే వరి బస్తాలను ఉంచారు. వర్షంతో అవి కూడా తడిసిపోయాయి. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. ఈ భారీ వర్షాలకు రైతులే కాదు విద్యుత్ శాఖ కూడా నష్టపోయింది. వర్షాల సమయంలో భారీగా ఈదురుగాలులు రావడంతో పలు చోట్లు 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లపై చెట్లు పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నెల కూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఈ వర్షాలతో పొలాల్లో ఉన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి. బలమైన గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. పలు చోట్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. రాష్ట్రంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.