ఏదైతే జరగకుండా ఉండాలని వైసీపీ నేతలు భావించారో అదే జరిగింది. ఆ సన్నివేశాలను చూసి షాకవ్వడం ఆ పార్టీ నేతల వంతైంది. సీఎం జగన్ టూర్లలో పరదాలు కట్టడం ఇందుకేనని అంటున్నారు.
ఏపీలో రాజకీయాలు ఓ రేంజ్‌లో హీటెక్కాయి. ఇన్నాళ్లు ప్రజలకు దూరంగా ఉన్న నేతలు.. ఇప్పుడిప్పుడే బయటకురావడం మొదలుపెట్టారు. దీంతో ప్రజల్లో ఆక్రోశం పెల్లుబుక్కింది. ఏదో విధంగా కోపం తీర్చు కుంటున్నారు. మేమంతా సిద్దం పేరిట బస్సు యాత్ర చేపడుతున్నారు సీఎం జగన్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జరుగుతున్న రోడ్ షోలో ఊహించని షాక్ తగిలింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి నేరుగా సీఎం జగన్‌పైకి చెప్పు విసిరాడు.
అయితే ఆ సమయంలో వాహనం కదలడంతో ఆ చెప్పు కాస్త సీఎం పక్కనే ఉన్న సెక్యూరిటీపై పడింది. దీంతో ఉలిక్కిపడడం సెక్యూరిటీ సిబ్బంది వంతైంది. చెప్పు విసిరిన సమయంలో బస్సుపై సీఎం జగన్‌తోపాటు, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ నైరుతిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
సీఎం జగన్ బస్సు ఎక్కుకముందే చెప్పులు విసరాలని ఆగంతకులు ప్లాన్ చేశారట. కానీ అదికాస్త ముఖ్యమంత్రి బస్సుపైకి వెళ్లిన తర్వాత జరిగింది. సీఎంను కార్నర్ చేసుకుని గుంపులోని ఓ వ్యక్తి రెండు చెప్పులు విసిరాడు. అందులో ఒకటి బస్సు సైడ్ అద్దాన్ని తాకి కిందపడిపోయింది. రెండోది మాత్రం నేరుగా సీఎం జగన్ మీదకు దూసుకొచ్చింది. దీంతో అధికారులు, వైసీపీ నేతలు అలర్టయినా.. చెప్పులు విసిరిన వ్యక్తిని మాత్రం గుర్తించలేకపోయారు.
మరోవైపు కర్నూలు జిల్లా గూడూరు మండలం కొత్తూరులో సీఎం జగన్ బస్సుయాత్రకు నిరసన సెగ తగిలింది. తాగునీటి సమస్యను తీర్చాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో జగన్ బస్సు యాత్రకు అడ్డుపడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై మహిళలను ఆపారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఐదేళ్ల పరదాలకు అర్థం తెలిసిందా? ఇదీ అసలు కథ అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.