తెలుగుదేశం పార్టీ తుది జాబితాను వెల్లడించింది. నాలుగు పార్లమెంట్ స్థానాలతో పాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తీవ్ర తర్జన భర్జన నడుమ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసింది.ఇందులో సీనియర్లకు సైతం పెద్దపీట వేసింది. అయితే చాలామంది సీనియర్లకు మొండి చేయి తప్పలేదు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరులకు టికెట్లు దక్కలేదు. తుది జాబితాలో సైతం వారి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు లకు ఊరట దక్కింది. వారి అభ్యర్థిత్వాలను టిడిపి హై కమాండ్ ఖరారు చేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ ఫైనల్ జాబితాను ప్రకటించింది.
పొత్తులో భాగంగా టిడిపికి 17 పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 13 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి.. విజయనగరం లోక్సభ స్థానం నుంచి కలిశట్టి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి, కడప నుంచి భూపేష్ రెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ పేర్లను ఖరారు చేశారు.
అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 139 మంది పేర్లను ప్రకటించారు.మూడు జాబితాలను వెల్లడించారు. అయితే ఇందులో మూడు నియోజకవర్గాలకు తాజాగా బిజెపి తన అభ్యర్థులను ప్రకటించింది. అందుకే మిగిలిన నియోజకవర్గాలతో నాలుగో జాబితాను విడుదల చేశారు. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు, పాడేరు నుండి వెంకట రమేష్, రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్, గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరాం, కదిరి నుంచి వెంకటప్రసాద్, భీమిలి నుంచి గంటా శ్రీనివాస్, దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి, అనంతపురం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ లను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇందులో భీమిలి అసెంబ్లీ స్థానాన్ని పట్టుబట్టి మరి గంటా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు ఎచ్చెర్ల సీటు ఆశించిన మాజీ మంత్రి కళా వెంకట్రావుకు చుక్కెదురు అయ్యింది. అనివార్య పరిస్థితుల్లో ఆయన చీపురుపల్లి నుంచి బరిలో దిగాల్సి వస్తోంది. మొత్తానికి టిడిపి తనకు పొత్తులో భాగంగా లభించిన 141 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారును పూర్తి చేసింది.