బిజెపి మరో అసెంబ్లీ స్థానాన్ని కోరుతుందా? 11వ సీటును ఆశిస్తోందా? అయితే అది టిడిపి స్థానమా? లేకుంటే జనసేనదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలతో పాటు పది అసెంబ్లీ సీట్లు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ,17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.అయితే తొలుత జనసేనకు 24 అసెంబ్లీ,మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు.కానీ బిజెపి కోసం పవన్ మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని వదులుకున్నారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మూడు స్థానాల్లో బిజెపి అభ్యర్థులను ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ఇది చాలదన్నట్టు మరో అసెంబ్లీ సీటు బిజెపికి రానుందని పురందేశ్వరి ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.
ఇప్పటికే బీజేపీకి ఇచ్చిన 10 సీట్లలోనూ రాజకీయ రచ్చ సాగుతోంది. బిజెపికి సీటు ఇచ్చిన ప్రతి చోట టిడిపి శ్రేణులు రగిలిపోతున్నాయి. మరికొన్నిచోట్ల జనసేన సైతం వీధిన పడుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పురందేశ్వరి ప్రకటన అగ్నికి ఆజ్యం పోస్తోంది.జనసేన పాలకొండ,అవనిగడ్డ, విశాఖ సౌత్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. తెలుగుదేశం సైతం భీమిలి, చీపురుపల్లితో పాటు మరో ఐదు స్థానాలను అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో బీజేపీ 11వ స్థానం విషయంలో ఎవరు త్యాగం చేయాల్సి ఉంటుందో తెలియాల్సి ఉంది.
బిజెపిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహం వంటి వారికి సీట్లు లేకుండా పోయాయి. కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూల నేతలకే టికెట్లు దక్కాయి. దీంతో అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. అటు హై కమాండ్ సైతం రాష్ట్ర నాయకత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ తరుణంలోనే పురందేశ్వరి ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోము వీర్రాజుకు సీటు సర్దుబాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం రాజమండ్రి అర్బన్ కానీ, రూరల్ నియోజకవర్గం కానీ అడుగుతున్నారు. కానీ అక్కడ టిడిపికి బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రకటించాల్సిన 8 స్థానాల్లో బిజెపికి ఒక సీటు వదులుకుంటారా? లేదా? అన్నది చూడాలి.