ఏపీలో పదవుల కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభ సీట్ల భర్తీ పూర్తి కావటంతో ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ పెరిగింది. నామినేటెడ్ లిస్టులో ఎవరికి అవకాశం ఉంటుందనేది ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చింది. దీంతో, ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం దక్కని నేతలు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఖాళీలు .. రాబోయే రోజుల్లో మొత్తంగా 13 వరకు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో, ఈ లిస్టు పైన ఇప్పటికే చంద్రబాబు – పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న ఖాళీలు
కూటమిలోని మూడు పార్టీల్లోని సీనియర్లు ఎమ్మెల్సీ సీట్ల పైన ఆశలు పెట్టుకున్నారు. మండలి లో ఇప్పటికే వైసీపీ నుంచి కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. వీటిని ఛైర్మన్ ఆమోదించాల్సి ఉంది. ఆమోదించిన తరువాత ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తే వారి స్థానంలో నలుగురి ఎంపిక పైన ఇప్పటికే ఒక నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు ఎమ్మెల్సీ ల రాజీనామాల ఆమోదం పొందింతే అదే లిస్టులో మరో నలుగురు ఉన్నట్లు సమాచారం. ఇక, మార్చి నెలాఖరు లోగా మరో అయిదుగురు పదవీ విరమణ చేయనున్నారు.
వీరికి ఖాయంగా
దీంతో, 12 ఖాళీలు ఖాయం గా కనిపిస్తున్నా..ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మూడు పార్టీల్లోనూ ఒత్తిడి ఉండటంతో తొలి ప్రయార్టీ లిస్టు పైన నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందు లో భాగంగా మంత్రిగా ఇప్పటికే ఖాయమైన మెగా బ్రదర్ నాగబాబు తో పాటుగా రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి పేర్లు తొలి జాబితాలోనే ఖాయం కానున్నాయి. పట్టభద్రుల స్థానాలకు ఇప్పటికే టీడీపీ తమ ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించింది. భర్తీ చేయనున్న జాబితాలో జనసేన నుంచి నాగబాబుకు ఇస్తే ఆ పార్టీ సంఖ్య మండలిలో రెండు కు చేరనుంది. అదే విధంగా బీజేపీకి ఒక స్థానం ఖాయంగా ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ ముఖ్యులు చెబుతున్నారు.
లిస్టులో ఉన్నదెవరు
టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ ఉంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలు.. సీనియర్లు ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్నారు. ఇందులో కొందరికి ఇప్పటికే హామీ దక్కింది. పిఠాపురం వర్మ, మాజీ మంత్రులు దేవినేని ఉమా, జవహర్, వంగవీటి రాధా,రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో, సామాజిక – ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి చివరగా చంద్రబాబు అవకాశం ఇస్తారనేది ఇప్పుడు కూటమిలో ఉత్కంఠ పెంచుతోంది.