UPDATES  

NEWS

 ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం, సజ్జనార్‌కు అభినందనలు

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లు ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పైరసీపై ఉక్కుపాదం మోపడం స్వాగతించదగ్గ పరిణామమని ఆయన ట్వీట్ చేశారు. డబ్బుల రూపంలోనే కాక, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిన తరుణంలో, పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామంగా ఆయన అభివర్ణించారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఈ ‘ఆపరేషన్’ విజయవంతమైందని, ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్‌కి మరోసారి అభినందనలు తెలియజేశారు.

పైరసీతో పాటు, బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా నష్టపోతున్నారో సజ్జనార్ చైతన్యపరుస్తున్నారని పవన్ కల్యాణ్ కొనియాడారు. పొంజీ స్కీమ్స్ మరియు బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే ఈ చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |