జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) కర్ణన్ తెలిపారు. రేపు (నవంబర్ 14) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలింగ్ ఈ నెల 11న ముగిసింది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని ఆర్వో పేర్కొన్నారు.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున, లెక్కింపు వేగాన్ని పెంచేందుకు ప్రత్యేక అనుమతితో 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు ఆర్వో కర్ణన్ తెలిపారు. లెక్కింపు కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించామని, కౌంటింగ్‌ను 10 రౌండ్లలో పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, మీడియా కోసం ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని ఆర్వో చెప్పారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, అదనంగా 15 ప్లాటూన్ల సిబ్బందిని కూడా రప్పిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే రావాలని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని జాయింట్ సీపీ హెచ్చరించారు.









