ఓవైపు సైనిక చర్యల, మరోవైపు సింధు జలాలను నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని పున:పరిశీలించాలని భారత్ ను కోరుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా.. భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాశారు. పాకిస్తాన్ సింధు జలాల అంశాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల నిలిపివేత
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు చనిపోయారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన భారత్, ఏప్రిల్ 23న జరిగిన భద్రతా కేబినెట్ కమిటీ సమావేశంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. 1960 ఒప్పందం ప్రకారం, భారత్ లో ఉన్న సింధు నది ద్వారా వచ్చి నీటిలో దాదాపు 30 శాతం భారత్ కు దక్కగా, మిగిలిన 70 శాతం పాకిస్తాన్ కు దక్కుతుంది. పహల్గామ్ దాడి తర్వాత పాక్ కు సింధు జలాలను నిలిపివేయడంతో పాటు వరద హెచ్చరికలను పంచుకోవడం ఆపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
మే 7న ‘ఆపరేషన్ సిందూర్’
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను మొదలు పెట్టింది. పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. కాల్పుల విరమణకు ముందు నాలుగు రోజులు రెండు వైపులా సైనిక దాడులు జరిగాయి. డ్రోన్, మిస్సైల్స్ అటాక్స్ జరిగాయి. అదే సమయంలో ఇప్పటి వరకు భారత ప్రభుత్వం సింధు జలాలను చుక్క కూడా విడుదల చేయలేదు. “ఏప్రిల్ 23న జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) నిర్ణయం ప్రకారం, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు భారత్ సింధు జలాలను నిలిపివేస్తుంది” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.
నీరు, రక్తం కలిసి ప్రవహించలేవన్న ప్రధాని మోడీ
అటు ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ లో పెచ్చరిల్లుతున్న సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించిందని చెప్పారు. పీవోకేతో పాటు ఉగ్ర నిర్మూలనపై స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడే ఆదేశంతో చర్చలు ఉంటాయన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్, ఈ విషయంపై మరోసారి ఆలోచించాలని కోరుతుంది. సింధు జలాల అంశంపై చర్చించేందుకు సిద్ధం అని ప్రకటించింది. అయితే, భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు పీవోకేపై స్పష్టమైన హామీ ఇస్తేనే చర్చలు ఉంటాయని బలంగా చెప్తోంది.