దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ కార్డుల జారీపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజలకు వివిధ రాష్ట్రాలు ఉచితంగా కార్డలు జారీ చేస్తుంటే కేంద్రం రేషన్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై స్పందించిన సుప్రీంకోర్టు.. కీలక సూచన చేసింది. ఇకపై దానిపై దృష్టిపెట్టాలని సూచించింది. దీంతో కేంద్రం, రాష్ట్రాలూ ఇరుకునపడ్డాయి.
పేద ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చే బదులు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ఇవాళ కేంద్రానికి సూచించింది. ప్రజలకు ఉచిత రేషన్ అందించడం కొనసాగించడం వల్ల ప్రభుత్వాపై ఆర్థిక భారం పడుతుందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
భారీ స్థాయిలో ఉచిత రేషన్ అందిస్తూ పోతే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డుల జారీని కొనసాగిస్తాయని, ఎందుకంటే ధాన్యాలను అందించే బాధ్యత కేంద్రంపై ఉందని వారికి తెలుసని వ్యాఖ్యానించింది.
ఆహార భద్రత చట్టం కింద కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉచిత రేషన్ అందించమని రాష్ట్రాలను అడిగితే, వారిలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఉటంకిస్తూ తాము చేయలేమని చెబుతారని తెలిపింది. అందువల్ల మరింత ఉపాధిని సృష్టించడంపై దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. కేంద్రం రేషన్ ఇస్తుంటే దాని కోసం కేవలం రాష్ట్రాలు మాత్రమే కార్డుల జారీకి ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందా అని కోర్టు ప్రశ్నించింది.
2013లో తెచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రస్తుత 80కోట్ల మంది పేదలకు గోధుమలు, బియ్యంతో సహా ఉచిత రేషన్‌ను కేంద్రం పంపిణీ చేస్తోందని, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అయినా కోటి మందిని ఈ పథకం నుంచి మినహాయించారని పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తెచ్చారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను కోర్టు సమీక్షించింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 8కి వాయిదా వేసింది.