కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టబద్దత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలంటూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు చేపట్టిన‘ఛలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దు మార్గం గుండా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు వందలాది మంది రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోకి అనుమతించబోమని పోలీసు అధికారులు చెప్పినా అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు రైతులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పూర్వక వాతావరణం ఏర్పడింది.
అడ్డుగా ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో రైతులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. పెద్ద వయసున్న రైతులు బాష్పవాయువు ప్రభావానికి గురయ్యి ఇబ్బందిపడ్డారు. ఇక రోడ్డుకు అడ్డంగా ముళ్ల తీగను కూడా ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ రహదారి 44పై శుక్రవారం ఉద్రిక్తకరమైన వాతావరణం కనిపించింది. కాగా వందకు పైగా మంది రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురి చేతుల్లో జాతీయ పతకాలు ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ సేవలు బంద్..
రైతులు ‘ఛలో ఢిల్లీ’ మార్చ్ మొదలు పెట్టడానికి కొన్ని నిమిషాల ముందు హర్యానాలోని అంబాలా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ మెసేజ్‌ల సేవలను పోలీసులు నిలిపివేశారు. డిసెంబర్ 9 ఈ సర్వీసులు ఆపివేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. మరోవైపు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడానికి వీల్లేదంటూ జిల్లా అధికారులు అంతకముందే ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఎంఎస్‌పీకి కట్టుబడి ఉన్నాం: కేంద్రం
రైతులు ‘ఛలో ఢిల్లీ’ ఆందోళన మొదలుపెట్టడానికి ముందు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేసింది. పంటలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇప్పటికే సోయాబీన్, ధాన్యం, జోన్నలు, గోధుమలను ఉత్పత్తి ధర కంటే 50 శాతం ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నామని అన్నారు.