తగ్గేదేలే అంటూ మాజీ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి రివర్స్ అటాక్ ఇవ్వడంలో, ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అనుకున్నారో ఏమో కానీ, ఈసారి పెద్ద ప్లాన్ తో మీడియా సమావేశం నిర్వహించారు జగన్. ఈ సమావేశంలో ఉద్యమ బాట పట్టనున్నట్లు, తమ కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం సాగించనున్నట్లు జగన్ తెలిపారు.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఊహించని షాక్ తిన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడిప్పుడే ఉద్యమబాటకు శ్రీకారం చుట్టారు. కేవలం 11 సీట్లు వైసీపీకి పరిమితం కాగా, క్యాడర్ కొంత ఆందోళన చెందింది. దీనితో పలు దఫాలుగా ఆయా జిల్లాల నాయకులతో జగన్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న తరుణంలో, ఇటీవల మీడియా ముఖంగా జగన్ సీరియస్ అయ్యారు. అలాగే కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అయితే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతూ, పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది.
కాగా జగన్ తాజాగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట షెడ్యూల్ ను ప్రకటించారు. డిసెంబరు 11న రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయనున్నట్లు, అందులో భాగంగా ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై అన్యాయంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని, దీనితో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని జగన్ అన్నారు. కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడుపై డిసెంబరు 27న ప్రజలతో ర్యాలీ నిర్వహించి, అన్ని జిల్లాల ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం అందించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కొత్త ఏడాది జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు సాగిస్తామని ప్రకటించారు.
అన్ని జిల్లాల్లో వైసీపీ ఉద్యమబాట సాగుతుందని, వైసీపీ శ్రేణులు కార్యక్రమాలను విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ను వైసీపీ కార్యకర్త పులి సాగర్ కలిసి రాజమహేంద్రవరంలో పోలీసులు తనపట్ల అమానవీయ రీతిలో ప్రవర్తించారని వివరించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదైన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఏదిఏమైనా ఇక నుండి వైసీపీ ఉద్యమబాట పడుతుండగా, కూటమి నేతల రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో వేచిచూడాలి.