ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై మరో కేసు నమోదు అయ్యింది. రూ. 50 కోట్ల విలువైన తమ పట్టా భూమిని కొందరు అధికారులు అక్రమంగా కొనుగోలు చేశారని బీర్ల మల్లేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 180లో ఈ భూములు ఉన్నట్లు బాధితుడు చెబుతున్నాడు. కేసులో ప్రభాకర్‌రావుతోపాటు మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ సహా పలువురు బ్యూరోకాట్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. తమ భూములపై పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన సురేష్ ముదిరాజ్ అనే వ్యక్తి ఆ భూములను ప్రభాకరరావు సహా పలువురు ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు విక్రయించినట్లు ఆరోపించారు.
IAS, IPS, రెవెన్యూ ఉన్నతాధికారులతో సహా ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ మోసానికి పాల్పడ్డారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. నిజానికి ఆ భూములపై తామే హక్కు దారులమని, భూ రికార్డులను తారుమారు చేసి మోసం చేశారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ప్రభాకర్ రావుపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏ1 నిందితుడుగా ఉన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరవాత ప్రభాకర్ రావు అమెరికా వెళిపోయారు. ఆయనను అధికారులు అమెరికా నుండి రప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ఇటీవలే ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డ్ మంజూరైనట్టు వార్తలు వచ్చాయి. అమెరికాలో స్థిరపడిన కుటుంబ సభ్యుల స్పాన్సర్ షిప్ తో ఆయనకు గ్రీన్ కార్డ్ మంజూరైనట్టు ప్రచారం జరిగింది. దీంతో విచారణపై ఇది ప్రభావితం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎలాగైనా ఆయనను ఇండియాకు రప్పించి విచారణ వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై ఈడీ కేసు కూడా నమోదు అవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది హాట్ టాపిక్ గా మారింది.