నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం పరిశ్రమకు ఇచ్చిన అనుమతులపై పునరాలోచిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హయాంలో ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారు. అయితే ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం ఆర్డీవో రత్నకుమారిని నిర్భందించి, ఆమె కారును ధ్వంసం చేశారు.
ఈ నేపథ్యంలో కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వాహనాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేయడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి వాహనాలు వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఇథనాల్ పరిశ్రమ తరలించే వరకు ఎన్ని అక్రమ అరెస్ట్ లు చేసినా భయపడేది లేదని హెచ్చరించారు. వందల సంఖ్యలో గ్రామస్థులు బయటకు రావడంతో గ్రామంలో భయాందోళనకర వాతావరణం నెలకొంది.
పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. డీఎస్పీ తమను కొట్టాడంటూ పురుగుల మందు డబ్బాలతో మహిళలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇథనాల్ ఫ్యాక్టరీపై పునరాలోచిస్తామని ప్రకటించింది. గ్రామస్థులతో కలెక్టర్ అభిలాష చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నివేధికను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు.