UPDATES  

NEWS

 గెలిచినప్పుడు ఈవిఎంలు బాగుంటాయి ఓడిపోతే టాంపర్ చేసినట్లా.. సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి చెందిన పార్టీలు ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) మెషీన్లు ట్యాంపర్ చేశారని ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయిందని, అదే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఈవిఎంల పనితీరు బాగున్నట్లు అంగీకరిస్తున్నారని సుప్రీం కోర్టు ఘటు వ్యాఖ్యలు చేసింది. మంగళవారం నవంబర్ 26, 2024న అధికార పార్టీలు ఈవిఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయని.. అందువల్ల పేపర్ బాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

 

” మీరు ఓడిపోయినప్పుడు ఈవిఎంలు ట్యాంపర్ చేసినట్లు, మీరు గెలిస్తే.. ఈవిఎంలు బాగున్నట్లా,” అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పిబి వరాలెతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో ఈవిఎంల విధానం తొలగించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ని తిరస్కరించింది. ఈ పిటీషన్‌లో అవినీతికి పాల్పడిన అభ్యర్థులను ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలని కూడా పిటీషర్ కెఎ పాల్ కోరారు.

 

గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ఈవిఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారని పిటీషనర్ కెఎపాల్ ప్రస్తావించారు. అయితే దీని సుప్రీం కోర్టు ధర్మసనం సమాధానమిస్తూ.. ఈవిఎంల పనితీరుపై ఓడిపోయినప్పుడు మాత్రమే ప్రశ్నించినవారు.. ఎన్నికల్లో విజయం సాధించాక ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ప్రశ్నించింది.

 

“చంద్రబాబు నాయుడు ఈసారి గెలిచారు, ఆయన ఈవిఎం గురించి ఇప్పుడేం మాట్లాడలేదు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయారు. కాబట్టి ఈవిఎంలలో ట్యాంపరింగ్ చేసే అవకాశముందని చెబుతున్నారు,” అని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

 

విచారణ సమయంలో కెఎ పాల్ వాదిస్తూ.. ఇండియాలో ఈవిఎంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని, అందుకే పేపర్ బ్యాలెట్ విధానంలో పారదర్శకత కోసం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలాగే ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో పంపిణీ జరుగుతున్న డబ్బును అధికారులు స్వాధీనం చేస్తున్నారని.. దీంతో ఎన్నికల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని లేకపోతే ప్రజాస్వామ్యం చనిపోతుందని వాదించారు.

 

దేశంలో 32 శాతం మంది ప్రజలు మాత్రమే ఓటు వేస్తున్నారని.. వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కెఎపాల్ అన్నారు. అలాగే పేరు ప్రస్తావించకుండా ఒక బడా వ్యాపారవేత్త దేశంలోని ఆరు రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చి రూ.48000 కోట్ల కాంట్రాక్టులు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వ్యాపారవేత్త ఇచ్చిన డబ్బులతో రాజకీయ పార్టీలు ఓట్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

 

అయితే సుప్రీం కోర్టు.. పాల్ వాదనలతో సంతృప్తి చెందలేదు. ఎన్నికల్లో డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఓటర్ల వరకు అవి ఎలా చేరుతున్నాయి? వీటికి సరైన ఆధారాలు లేవని.. అయినా వీటికి బ్యాలెట్ పేపర్ ఎన్నికల విధానానికి సంబంధం ఏంటని ప్రశ్నించింది. చివరికి కెఎ పాల్ పిటీషన్ ని కొట్టివేస్తూ.. ఆయన లేవనెత్తిన సమస్యలను సుప్రీం కోర్టులో సమాధానం లభించదని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పింది.

 

ఇంతకుముందు ఏప్రిల్ 26, 2024న సుప్రీం కోర్టులో ఈవిఎంలోని అన్ని ఓట్లను వివిప్యాట్ స్లిప్పులతో చెక్ చేయించాలని దాఖలైన పిటీషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దిపాంకర్ దత్తా విచారణ చేశారు. ఆ విచారణలో కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తులిద్దరూ ఈవిఎంలు ద్వారా పారదర్శకంగా, విశ్వసనీయంగా ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |