UPDATES  

NEWS

 ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా.. మహా సీఎం అతడే ఫిక్స్..?

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు ఆయన అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్‌నాథ్‌ షిండే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు.. మహారాష్ట్రకు కొత్త సీఎం ఎవరు అనే అంశంపైనా ఉత్కంఠ నెలకొంది. ఫడణవిస్‌, షిండే, అజిత్‌ పవార్‌లో ఒకరు సీఎంగా ఎంపిక కానున్నారు.

 

మహారాష్ట్రలో మహావిజయం సాధించింది మహాయుతి కూటమి. 288 స్థానాలకు గానూ 230 సీట్లతో ఎన్డీయే కూటమికి బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రజలు. అయితే ఇంతటి గ్రాండ్‌ విక్టరీ సాధించిన కూటమి ఇప్పుడు సీఎం ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది.సీఎం అభ్యర్థిత్వంపై ఇంకా మహా డ్రామా కొనసాగుతోంది. ఓ వైపు నేటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుండగా ఇంత వరకు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నీలినీడలు వీడలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా ఏక్‌నాథ్‌ షిండే పేరును కూడా తీసేసే అవకాశం లేదు.

 

సీట్ల పరంగా కూటమిలో బీజేపీకే ఎక్కువ వచ్చాయి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ భావించొచ్చు.అదే జరిగితే ఫడ్నవీస్‌ మూడో సారి ముచ్చటగా సీఎం అవుతారు. అలా కాకుండా బీహార్‌ ఫార్ములాను మహారాష్ట్రలోనూ అమలు చేస్తే ఏక్‌నాథ్‌ షిండేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది.సీఎం రేసులో ముందంజలో ఉన్న ఫడ్నవీస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ కూడా హస్తినలోనే ఉన్నారు.

 

బీహార్‌ ఫార్ములా ప్రకారం.. ఏక్‌నాథ్‌ షిండేను సీఎంగా కొనసాగించాలని శివసేనలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షాలను ఉపయోగించుకుని, చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా బీజేపీ.. వాటి అడ్డు తొలగించుకుంటుందని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తుంటాయని, దీనికి చెక్‌ పెట్టేందుకు షిండే సీఎం కావాలనే వాదనను తెరపైకి తెస్తున్నారు. బీహార్‌లో జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా మిత్ర ధర్మాన్ని పాటించి నీతీష్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

 

బీజేపీ మహారాష్ట్ర నేతలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. ఫడ్నవీస్‌నే సీఎం చేయాలని కోరుతున్నారు.రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఆయనకే ఉందని స్పష్టం చేస్తున్నారు. శివసేనలోని కొందరి నేతల వ్యాఖ్యలను ఖండించారు. అది పార్టీ వైఖరి కాకపోవచ్చని, అది వారి వ్యక్తిగతం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్‌ వైపే ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

 

మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న వార్తలొచ్చాయి. వాటిని అధికారులు ఖండించారు. అటువంటి పరిస్థితి రాదని తేల్చి చెప్పారు. ఆదివారమే కొత్తగా ఎన్నికైన సభ్యుల పేర్లతో గెజిట్‌ను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు ఎన్నికల సంఘం అధికారులు అందజేశారు. అంటే 15వ అసెంబ్లీ అమల్లోకి వచ్చినట్లేనని అధికారులు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 73 ప్రకారం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచి అసెంబ్లీ మనుగడలో ఉన్నట్లేనని వివరించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |