రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగుచర్ల దాడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. స్వయంగా అతనే పోలీసు స్టేషన్ కు వచ్చి సరెండర్ అవ్వడంతో.. అతన్ని పోలీసులు కొడంగల్ కోర్టుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా కస్టడీకి కోరే అవకాశాలున్నాయి. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన సురేష్.. కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతన కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టింది. అయినా.. ఇన్నాళ్లు ఆచూకీ లేకుండా పోయిన సురేష్ నవంబర్ 19న లొంగిపోవడంతో.. కేసు విచారణలో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.
కొడంగల్ లోని లగచర్ల గ్రామంలో ఫార్మా సిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థుల అభిప్రాయాలు సేకరించేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైనా, సబ్ కలెక్టర్ సహా, ఇతర ఉన్నతాధికారులు వెళ్లారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు గ్రామ శివారులో సభా వేదిక ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. అక్కడికి గ్రామస్థులు రాలేదు. ఆ సమయంలో గ్రామస్థుల తరఫున కలెక్టర్ దగ్గరకు వెళ్లిన భోగమోని సురేష్.. అధికారులే గ్రామానికి రావాలని ఒప్పించాడు. కలెక్టర్ వచ్చి నష్టపరిహారం సహా ఇతర అంశాలపై హామీ ఇవ్వాలని కోరాడు. అతని మధ్యవర్తిత్వం కారణంగానే.. అధికారులు లగచర్లకు వెళ్లారు.
అభిప్రాయ సేకరణ తేదీని నిర్ణయించిన తర్వాత.. సభ జరిగే రోజు అల్లర్లు జరిగే అవకాశముందని ఇంటిలిజెన్స్ హెచ్చరించింది. సభకు ఒక్కరోజు ముందు ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి నివేదించిన ఇంటెలిజెన్స్.. అందులో అనుమానితుల పేర్లను సైతం పంపింది. అందులో భోగమోని సురేష్ పేరు సైతం ఉంది. అంటే.. మొదటి నుంచి సురేష్ గ్రామస్థుల్ని ఆందోళనలు, దాడులు చేసేందుకు సిద్ధం చేస్తున్నాడన్న సమాచారం పోలీసుల దగ్గర ఉంది. ఈ కారణంగానే.. పోలీసులు దాడి అనంతరం సురేష్ కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ.. దాడి జరిగిన వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన సురేష్.. తానే స్వయంగా వచ్చి లొంగిపోయే వరకు పోలీసులకు కనిపించలేదు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర అధికారులపై కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డ వారికి ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. వారిలో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే.. వారిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు సైతం తరలించారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి సైతం.. పోలీసుల కస్టడీలోనే ఉండడం, ఇప్పుడు కీలక నిందితుడిగా ఉన్న సురేష్ లొంగిపోవడంతో కేసులో మరిన్ని విషయాలు భయటకు వస్తాయని భావిస్తున్నారు. అసలు వీరిద్దరు.. దాడి జరిగిన రోజు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు. ఏఏ విషయాలపై తరుచూ మాట్లాడుకున్నారు. దాడికి ఏమైనా ప్లాన్ చేశారా వంటి విషయాలతో పాటు అనేక అంశాలపై విచారణ జరపనున్నారు. ఇప్పటికే.. పట్నం రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేరు ఉండడం సంచలనం సృష్టిస్తోంది.