UPDATES  

NEWS

 హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. రంగనాథ్ ఏమన్నారంటే..?

హైదరాబాద్‌ కూకట్‌‌పల్లిలోని యాదవబస్తీలో తమ కూతుళ్ల ఇళ్లను హైడ్రా కూల్చుతుందనే భయంతో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. శివయ్య దంపతులు వారికి పెళ్లిళ్లు చేసి కట్నంగా తలో ఇంటిని రాసి ఇచ్చారు

కాగా, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తమ బిడ్డలకు ఇచ్చిన ఇళ్లు కూడా కూల్చివేస్తారనే మనస్తాపంతో బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. అంతకుముందు కూతుర్లు తమ ఇళ్లను హైడ్రా కూల్చేవేసే ప్రమాదం ఉందని బుచ్చమ్మతో వాపోయినట్లు సమాచారం

బుచ్చమ్మ ఆత్మహత్య ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. శివయ్య దంపతులు కూతుర్లకు రాసిచ్చిన ఇళ్లు కూకట్ పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ.. ఎఫ్‌టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని రంగనాథ్ వెల్లడించారు.

కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. హైడ్రా గురించి మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ భయాలు పుట్టించవద్దని కమిషనర్ రంగనాథ్ కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారని అన్నారు. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదని స్పష్టం చేశారు. మూసీ నదిలో శనివారం భారీగా ఇళ్లు కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయన్నారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవమైన, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమిషనర్ రంగనాథ్ కోరారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దని ప్రజలకు సూచించారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితమైన సూచనలు జారీ చేసిందని రంగనాథ్ వివరించారు. మరోవైపు, తాము నివాసం ఉండే ఇళ్లను కూల్చడంతో తాము రోడ్డుపైకి రావాల్సి వచ్చిందంటూ కొందరు హైడ్రా బాధితులు ఆందోళనలకు దిగుతుండటం గమనార్హం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |