తిరుమల తిరుపతి దేవస్థానం నూతన బోర్డు ఏర్పాటు పై కసరత్తు ముమ్మరం అయింది. ముందుగా ఛైర్మన్ నియామకం పైన ఒకటి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే ఛైర్మన్ ను ప్రక టించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డు సభ్యుల పైన సూత్ర ప్రాయంగా నిర్ణయించారు.
చంద్రబాబు కసరత్తు
తిరుమలకు నూతన పాలక వర్గం ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు పరీక్షగా మారుతోంది. తిరుమలలో లడ్డూ వివాదం తరువాత ఏ నిర్ణయం తీసుకున్నా ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీకి నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా ఇంకా టీటీడీకి పాలక మండలి ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ గా పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
టీటీడీ కొత్త ఛైర్మన్
వచ్చే నెల 4వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బోర్డులో అవకాశం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. కేంద్రంతో పాటుగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి అవకాశం ఇవ్వాలి. దీంతో, చంద్రబాబు ఎవరిని నియిమించినా ఎలాంటి వివాదాలు..విమర్శలకు తావు లేని వారికి ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో..ముందుగా బ్రహ్మోత్సవాల లోగా ఛైర్మన్ నియామకం పైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పలువురి పేర్లు పరిశీలించిన తరువాత తుది రేసులో ఇద్దరి పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
అనూహ్య ఎంపిక
టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఒక మీడియా సంస్థల యజమానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఖాయం అనే ప్రచారం సాగుతోంది. అయితే, మాజీ న్యాయమూర్తి పేరు తెర మీదకు వచ్చింది. కానీ, గతంలో ఇచ్చిన హామీ మేరకు టీవీ ఛానల్ యజమానికి ఇస్తారని చెబుతున్నా…పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం టీటీడీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో చంద్రబాబు రెండు కొత్త పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో ఒకరు మాజీ కేంద్ర మంత్రి కాగా.. మరొకరు, ఆధ్మాత్మిక రంగంలో ఉన్న వారిగా సమాచారం. దీంతో, ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.