UPDATES  

NEWS

 కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీస్..

తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీస్ లో తెలంగాణకు-1, ఆంధ్రాకు -2 కేటాయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

 

కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నదన్నారు. వీటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పారు.

 

అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రూ. 25 వేల కోట్లతో ఏపీ, తెలంగాణ, పంజాబ్, బీహార్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 25 వేల కోట్ల ప్యాకేజీని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

 

అయితే, ఈ కొత్త ప్రాజెక్టులతో భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం కేంద్రం భావిస్తుంది. సుమారుగా రూ. 1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని కేంద్ర భావిస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా గృహ, వాణిజ్య ప్రాంతాలతో కూడిన సగటు పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించడం సాధ్యమంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే.. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించింది. దీంతో రాష్ట్రంలో నారా చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఆయన ఢిల్లీకి పలు మార్లు వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీతోపాటు వివిధ శాఖల మంత్రులను ఆయన కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో మాట్లాడి ప్రత్యేక కేటాయింపులు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

 

ఈ క్రమంలోనే ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్నారు. అన్ని విధాలుగా ఏపీని ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు వరాలను ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా కేంద్రం సహకరిస్తుందంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |