తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపటం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక హైడ్రా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములను పరిరక్షించడం కోసం ఏర్పడిన హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో హైడ్రా దూకుడు
హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలలో ఆక్రమణలకు గురైన భూములను ఎటువంటి రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా హేమాహేమీల ఆస్తులను కూడా ఎలాంటి భయం లేకుండా కూల్చివేతలకు పాల్పడుతుంది. ఆకాశాన్నింటిన విధంగా నిర్మించిన భవన సముదాయాలు కూడా నేలమట్టం చేస్తుంది. త్వరలో విశ్వరూపం చూపించబోతుంది.
రాష్ట్రంలో హైడ్రా పేరుతో కొత్త చట్టం
ఇప్పుడు హైడ్రా పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో హైడ్రాను విస్తరించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టాన్ని రూపొందించబోతున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. నిబంధనలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రా పేరుతో కబ్జాదారులకు స్వయంగా నోటీసులు జారీ చేస్తామని ఏవి రంగనాథ్ వెల్లడించారు.
హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు
అంతే కాదు హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని, వాటిలో ప్రజలు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో సహకరించిన ప్రభుత్వ అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని వారిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామని ఏవి రంగనాథ్ అధికారులు కూడా షాక్ అయ్యే వార్త చెప్పారు.
ప్రభుత్వ అధికారులకు హైడ్రా షాక్ ఇస్తుందా
ఇక హైడ్రా దూకుడు నేపథ్యంలో ఆక్రమణలకు పాల్పడిన వారే కాదు, అక్రమ నిర్మాణాల విషయంలో చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ఆ నిర్మాణాలు చేసుకునేందుకు సహకరించిన వారు కూడా దోషులుగా నిలబడబోతున్నారు. ఇక ప్రభుత్వ అధికారులకు కూడా హైడ్రా వెన్నులో వణుకు పుట్టిస్తోంది.