UPDATES  

NEWS

 లోక్‌సభ స్పీకర్ పదవిపై వీడిన సస్పెన్స్..!

లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఏర్పడిన సస్పెన్స్ తొలగిపోయింది. కొత్త స్పీకర్ ఎవరనేది తేలిపోయింది. 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు సభ్యులు ఆయనను మూజువాణి ఓటు ద్వారా ఎన్నుకున్నారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఆయన ఆసీనులయ్యారు.

 

17వ లోక్‌సభకు ఓం బిర్లా స్పీకర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయననే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వివాదరహితుడు కావడం, స్పీకర్ హోదాలో సమన్యాయాన్ని పాటించారనే సదభిప్రాయం ఓం బిర్లాపై ఉండటమే కారణమని చెబుతున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోటా-బూందీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఓం బిర్లా. ఇక్కడి నుంచి ఆయన గెలవడం ఇది మూడోసారి. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్‌ను 41 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

 

స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగడం లోక్‌సభ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటివరకు పని చేసిన స్పీకర్లు అందరూ నామినేట్ అయిన వాళ్లే. ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా ఓటింగ్ జరగబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ నిరాకరించడంతో ఈ ఎన్నిక అవసరమైంది.

 

ఈ ఉదయం 11 గంటలకు సభా కార్యకలాపాలు ఆరంభం అయ్యాయి. ఆ వెంటనే ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయని సభ్యులు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలో ప్రవేశపెట్టారు. రెండో తీర్మానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్.. ప్రతిపాదించారు.

 

ఆ తరువాత ఓటింగ్ ప్రక్రియ ఆరంభమైంది. వాయిస్ ఓట్ ద్వారా సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జీతన్ రామ్ మాంఝీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సహా ఇతర నాయకులు కూడా ఓం బిర్లాను స్పీకర్‌గా ఎన్నుకునే తీర్మానానికి మద్దతు ఇచ్చారు. అనంతరం ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్.. భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.

 

ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఆయనను సగౌరవంగా స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి తరఫున పోటీ చేసిన కే సురేష్ ఓడిపోయారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |