UPDATES  

NEWS

 ఆ వీడియోల్లోని అమ్మాయిలు నిజం కాదు: సైబర్ ‘హనీట్రాప్’పై సిపి సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

సోషల్ మీడియాలో యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ‘హనీట్రాప్’ సైబర్ నేరాల పట్ల హైదరాబాద్ సిపి సజ్జనార్ తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో మాట్లాడండి” అంటూ వచ్చే ప్రకటనల వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు అసలు మనుషులే కాదని, అవన్నీ ఏఐ (Artificial Intelligence) సాయంతో సృష్టించిన నకిలీ వీడియోలని ఆయన స్పష్టం చేశారు. యువత తమ క్షణికావేశంలో ఇటువంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

ఈ తరహా మోసాలు ఎలా జరుగుతాయో వివరిస్తూ.. నేరగాళ్లు పంపే లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేయగానే, బాధితుల ఫోన్‌లోని కాంటాక్ట్స్ మరియు గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్తాయని సజ్జనార్ తెలిపారు. ఆ తర్వాత వీడియో కాల్ పేరుతో నగ్న వీడియోలు ప్లే చేసి, బాధితుల ముఖాలను రికార్డ్ చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి, బంధుమిత్రులకు పంపిస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి అందినకాడికి దోచుకుంటారని వివరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే ఇటువంటి ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

పరువు పోతుందన్న భయంతో సైబర్ నేరగాళ్లకు డబ్బులు చెల్లించి మరింతగా చిక్కుకోవద్దని సజ్జనార్ హితవు పలికారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ఇలాంటి వలలో చిక్కుకున్నట్లయితే, ఏమాత్రం భయపడకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఆన్‌లైన్‌లో ఎవరూ ఊరికే స్నేహితులు కారని, ప్రతి ఆకర్షణ వెనుక ఒక మోసం ఉండే అవకాశం ఉందని యువత గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |