తెలుగు సినీ పరిశ్రమ గర్వపడేలా ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల వేడుకలో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం దక్కింది. గతేడాది దివంగతులైన ప్రపంచ సినీ ప్రముఖులకు నివాళులర్పించే ‘ఇన్ మెమోరియం’ విభాగంలో అకాడమీ ఆయన పేరును స్మరించుకుంది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో కోట శ్రీనివాసరావు చిత్రపటాన్ని ప్రదర్శించి, ఆయన సినీ సేవలను అంతర్జాతీయ వేదికపై కొనియాడారు.
కోట శ్రీనివాసరావుతో పాటు భారతీయ సినీ దిగ్గజాలు ధర్మేంద్ర, సీనియర్ నటి సరోజాదేవి, మనోజ్ కుమార్‌లను కూడా అకాడమీ గౌరవించింది. అయితే, భారతీయ నటుల జాబితాలో తొలుత కోట శ్రీనివాసరావు పేరును ప్రస్తావించడం విశేషం. అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌లోని గ్యాలరీలో కూడా వీరి చిత్రాలను ప్రదర్శించి, భారతీయ సినిమాకు వారు అందించిన విశేష కృషిని ప్రపంచానికి గుర్తు చేశారు.
2025 జూలై 13న కన్నుమూసిన కోట శ్రీనివాసరావు, తన అద్భుతమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు. తొమ్మిది నంది అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఈ నట దిగ్గజానికి ఆస్కార్ వంటి ప్రపంచ సినీ వేదికపై నివాళి లభించడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం కోట కుటుంబానికే కాకుండా, మొత్తం తెలుగు సినిమాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు.








