ఆర్టీసీ జేఏసీ ప్రధానంగా 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని (సుమారు రూ. 350 కోట్లు) ప్రతి నెలా కోత లేకుండా విడుదల చేయాలని కోరుతున్నారు. సంస్థకు రావాల్సిన పాత బకాయిలు రూ. 2,500 కోట్లు కూడా తక్షణమే చెల్లించాలని, ఉద్యోగులకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు పట్టుబడుతున్నారు.
క్షేత్రస్థాయిలో పెరిగిన పనిభారం, గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను కూడా జేఏసీ తమ నోటీసులో ప్రస్తావించింది. సంస్థ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో నోటీసు అందజేసిన నేతలు, అనంతరం లేబర్ కమిషనర్‌కు కూడా వినతిపత్రం సమర్పించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం 14 రోజుల గడువు ముగిసిన తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మె తేదీని ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వం చర్చలకు చొరవ చూపి తమ ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు కార్మిక నేతలు తెలిపారు. అయితే, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోతే సమ్మె అనివార్యమని వారు నొక్కి చెప్పారు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్న తరుణంలో, ఆర్టీసీ సమ్మె కూడా తోడైతే రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది.








