తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల నటి రష్మిక మందన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన శుభసమయంలో, ఎనిమిదేళ్ల క్రితం నాటి తన తల్లి ప్రైవేట్ ఆడియో క్లిప్‌ను కావాలనే బయటకు తీసి వివాదం సృష్టించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను మౌనంగా భరించానని, కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని ఇందులోకి లాగడం హద్దులు దాటడమేనని రష్మిక స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేయడం, వాటిని వక్రీకరించి ప్రచారం చేయడం తన ప్రైవసీకి భంగం కలిగించడమేనని ఆమె పేర్కొన్నారు. కేవలం వ్యూస్ కోసం ఒకరి గౌరవాన్ని తాకట్టు పెట్టే ధోరణిని సహించేది లేదని హెచ్చరిస్తూ, సదరు ఆడియో క్లిప్‌ను ప్రచారం చేస్తున్న వారికి 24 గంటల గడువు విధించారు. ఈ గడువులోగా వాటిని సోషల్ మీడియా నుండి తొలగించకపోతే సంబంధిత వ్యక్తులు మరియు మీడియా సంస్థలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మిక గట్టి వార్నింగ్ ఇచ్చారు.
వాస్తవానికి ఈ ఆడియో క్లిప్ 2018లో రష్మిక, రక్షిత్ శెట్టి విడిపోయిన నాటి సంఘటనలకు సంబంధించి ఆమె తల్లి మాట్లాడినట్లు తెలుస్తోంది. పాత విషయాలను ఇప్పుడు కావాలనే తవ్వి తీయడంపై నెటిజన్లు కూడా రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఇటువంటి వేధింపులకు గురిచేయడం అమానుషమని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.








