UPDATES  

NEWS

 ప్రైవేట్ బిల్లులతో కాంగ్రెస్‌ను నిలదీస్తాం: అసెంబ్లీ సమావేశాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ తరఫున ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ను ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. తొలి క్యాబినెట్‌లోనే గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం అసెంబ్లీలో అంకెల గారడీ చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. లేని అప్పులను ఉన్నట్లుగా చూపిస్తూ అబద్ధాలతో కాలక్షేపం చేస్తోందని, ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అసత్యాలను అంకెలతో సహా ఎండగడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సగం పదవీకాలాన్ని పూర్తి చేసుకుందని, కానీ హామీల అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులను పక్కన పెట్టి, రాహుల్ గాంధీ కోసం వెయ్యి కోట్లు ఇస్తామనడం రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

మూసీ బాధితులు, ఖమ్మం వెలుగుమట్ల బాధితుల తరఫున అసెంబ్లీలో పోరాడతామని కేటీఆర్ తెలిపారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో బడ్జెట్ చర్చలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం ‘బుల్డోజర్ టాక్టిక్స్’ ప్రయోగిస్తోందని, దీనిపై శాసనసభ లోపల, బయట పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా కడిగి పారేస్తామని ఆయన హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |