UPDATES  

NEWS

 లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్: కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు నిందితులపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ (డిశ్చార్జ్) వారికి ఊరటనిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో బలమైన వాదనలు వినిపించారు.

గతంలో రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసును విచారిస్తూ.. దర్యాప్తు సంస్థలు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లలో స్పష్టత లేదని, తగిన ప్రాథమిక ఆధారాలు లేకుండా నిందితులను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే నిందితులందరినీ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భారీగా అవినీతి జరిగిందని, ‘సౌత్ గ్రూప్’ ప్రమేయంపై మరిన్ని సాక్ష్యాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.

సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రతివాదులందరికీ నోటీసులు పంపుతూ, తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. కింది కోర్టులో ఊరట లభించిందని సంతోషించే లోపే, హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో నిందితులకు మళ్ళీ చట్టపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలు ఇప్పుడు రాజకీయంగా మరియు న్యాయపరంగా అత్యంత కీలకంగా మారాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |