రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఏటా రూ.20,000 సాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 భరిస్తోందని వివరించారు. రైతు బిడ్డగా వారి కష్టాలు తనకు తెలుసన్న సీఎం, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత 20 నెలలుగా అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ, గోదావరి పుష్కరాల నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా ఇప్పటికే కృష్ణా-గోదావరి డెల్టాలను అనుసంధానం చేశామని, భూగర్భ జలాల పెంపునకు చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టామని వివరించారు. చివరి ఆయకట్టు రైతుకు కూడా నీరు అందేలా సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కాలువలు, డ్రెయిన్ల ఆధునీకరణకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ డిజిటల్ క్రాప్ సర్వేను అమలు చేస్తున్నామని, ఆక్వా రైతులకు రూ.810 కోట్ల రాయితీలు అందించామని సీఎం గుర్తుచేశారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని, గన్నవరం విమానాశ్రయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచుతామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








