బ్రాహ్మణులు మరియు వేద మంత్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై వివాదం ముదురుతోంది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాలలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. ఆశీర్వచనం అందించే బ్రాహ్మణులను పరుష పదజాలంతో దూషించడం అమానుషమని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బ్రాహ్మణ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని, వేదాలను కించపరిచేలా మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వారు మండిపడ్డారు.
ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోతే ఉమాకాంత్ శర్మ మాట్లాడుతూ.. కవ్వంపల్లి సత్యనారాయణ సభలో వేద మంత్రాల అర్థం తెలియకుండా సామేల్ బూతు పదాలు వాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ‘లోకాసమస్తా సుఖినోభవంతు’ అని అందరి క్షేమాన్ని కోరుకునే బ్రాహ్మణులపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రులు మరియు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విషయంలో మౌనంగా ఉండటం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించడమేనని బ్రాహ్మణ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఎమ్మెల్యే సామేల్‌కు వేదాల పట్ల కనీస అవగాహన లేదని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల రాజేందర్ శర్మ, సురేష్ శర్మ సహా పలువురు బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పాల్గొని, చట్టపరంగా కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వెల్లడించారు.








