జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జీవన్ రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ అని, ఆయనతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా చర్చలు జరపాలని సూచించారు. ఎవరో ఒకరితో మాట్లాడిస్తామంటే కుదరదని, ఈ ఎపిసోడ్‌లో పీసీసీ చీఫ్ స్వయంగా బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జీవన్ రెడ్డి తన తండ్రి సమకాలీకుడని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వెంటే నిలబడ్డారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. అలాంటి నిబద్ధత గల నాయకుడి విషయంలో పార్టీ నాయకత్వం అత్యంత సీరియస్‌గా ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. తనతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చొరవను అధ్యక్షుడే తీసుకోవాలని తేల్చి చెప్పారు.
ఇదే క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక మరియు ఇతర రాజకీయ అంశాలపై కూడా శ్రీధర్ బాబు స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి జగ్గారెడ్డి పేరును ప్రతిపాదించడంపై స్పందిస్తూ, జగ్గారెడ్డి కూడా సీనియర్ నాయకుడేనని అన్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రిగా ఉన్నవారు మరో ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని సమర్థించారు.








