తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడు వంటి వ్యక్తి ఈ పదవిలో కొనసాగడం హిందూ సమాజానికే అవమానమని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల ప్రస్తుతం అరాచక శక్తులకు నిలయంగా మారుతోందని, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన క్షేత్రంలో ఇప్పుడు నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సామాన్య భక్తులకు దక్కాల్సిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బీఆర్ నాయుడు తన అనుచరులకు, ఆకు రౌడీలకు కట్టబెడుతున్నారని భూమన ఆరోపించారు. ఈ అన్యాయాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన వైసీపీ మహిళా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ఆయన విమర్శించారు.
బీఆర్ నాయుడికి సంబంధించి ఇటీవల బయటకు వచ్చిన వివాదాస్పద వీడియోలను ప్రస్తావిస్తూ.. అటువంటి వ్యక్తి చైర్మన్‌గా ఉండటం వల్ల తిరుమల విశిష్టత దెబ్బతింటోందని భూమన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అసాంఘిక శక్తులపై పోరాటం చేసిన సుదీర్ఘ చరిత్ర తనదని, తిరుమల పవిత్రత కోసం తాము ఎంతకైనా సిద్ధమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.








