తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) యాజమాన్యం తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగులకు ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన ‘స్పెషల్ ఇంక్రిమెంట్’ను రద్దు చేస్తూ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ బోర్డు తీసుకున్న తీర్మానం మేరకు ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని, ఇకపై ఆపరేషన్ చేయించుకున్నా ఎటువంటి అదనపు ఇంక్రిమెంట్ లభించదని స్పష్టం చేసింది. అయితే, దీనికి సంబంధించి ఇచ్చే స్పెషల్ క్యాజువల్ లీవ్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.
ఇప్పటికే తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) సమ్మె నోటీసు ఇచ్చి వేచి చూస్తోంది. ఇలాంటి ఉత్కంఠ భరిత సమయంలో, ఉన్న సౌకర్యాలను కూడా తొలగించడం “పుండు మీద కారం చల్లినట్లు” ఉందని కార్మికులు మండిపడుతున్నారు. యాజమాన్యం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
మరోవైపు, పండగ వేళ సామాన్య ప్రజలపై కూడా ఆర్టీసీ భారం మోపింది. స్పెషల్ బస్సుల పేరుతో టికెట్ ధరలను అమాంతం పెంచేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) కొనసాగుతున్నప్పటికీ, పండగ రద్దీని ఆసరాగా చేసుకుని చార్జీలు పెంచడం సరికాదని జనం అభిప్రాయపడుతున్నారు. అటు ఉద్యోగులకు ఇంక్రిమెంట్ల రద్దు, ఇటు ప్రజలపై చార్జీల భారం.. వెరసి ఆర్టీసీ నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.








