మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో అరెస్టైన ఏపీ ఎంపీ పుట్టా మహేశ్‌తో పాటు మరో ఎనిమిది మందికి నిబంధనల మేరకే స్టేషన్ బెయిల్ వచ్చిందని, ఇందులో ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వెల్లడించారు.
రాజకీయ ముఖచిత్రంపై స్పందిస్తూ, తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు రాబోవని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న జమిలి విధానం కారణంగా 2029లోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన విశ్లేషించారు. ఇదే తరుణంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ముందుగానే అమలులోకి వస్తే తాము స్వాగతిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల సన్నద్ధత, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఇప్పటికే అధిష్ఠానంతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి వెళ్ళిన ఆయన, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని అధిష్ఠానానికి పరిచయం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై జాతీయ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులకు సహకారం కోరడం ఈ పర్యటనలో ప్రధాన అంశమని ఆయన వివరించారు.








